Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా1వఅధ్యాయము

1-4. ఘనతవహించిన థెయొఫిలా, ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకై వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని 
5-6. యూదైయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగితిలోనున్ను జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధులచొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. 
7  ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహుకాలము గడచిన (వృద్ధులైరి. ) 
8  జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించుచుండగా 
9  యాజకమర్యాదచొప్పున ప్రభువు ఆలయములోకి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను. 
10  ధూపసమయమందు ప్రజల సమూహమంతయు వెలపట ప్రార్థనచేయుచుండగా 
11  ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా 
12  జెకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయెను. 
13  అప్పుడా దూత అతనితో -జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహను అని పేరు పెట్టుదువు. 
14-16. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్బమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. 
17  మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువుకొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. 
18  జెకర్యా -యిదినాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగ 
19  దూత -నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. 
20  మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడలేక మౌనివై యుందువని అతనితో చెప్పెను. 
21  ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, గర్భాలయమునందు అతడు ఆలస్యము చేసినందకు ఆశ్చర్యపడిరి. 
22  అతడు వెలిపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున, గర్భాలయములో అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై యుండెను. 
23  అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను. 
24  ఆ దినములైన పిమ్మట తన భార్య ఎలీసబెతు గర్భవతియై -మనుష్యులలో నాకుండిన అవమానమును పరిహరించుటకు 
25  నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగు చేసెననుకొని అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను. 
26  ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలైయలోని నజరేతను ఊరిలో 
27  దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యకపేరు మరియ. 
28  ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. 
29-30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి -ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత -మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. 
31  ఇదిగో నీవు గర్భముధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; 
32  ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. 
33  ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల నేలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. 
34  అందుకు మరియ -నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా 
35  దూత -పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశివు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. 
36  మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; 
37  దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. 
38  అందుకు మరియ -ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్దనుండి వెళ్లెను. 
39  ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి 
40  జెకర్యా యింటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనముచేసెను. 
41  ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులువేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను - 
42  స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును 
43  నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? 
44  ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. 
45  ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధంచును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. 
46  అప్పుడు మరియ యిట్లనెను - నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 
47  ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను 
48  నా ఆత్మనా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. 
49  సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారు నన్నుధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము 
50  ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును. 
51  ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులనుచెదరగొట్టెను 
52  సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను 
53  ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులనువట్టిచేతలతో పంపివేసెను. 
54-55. అబ్రాహాముకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. 
56  అంతట మరియ యించుమించు మూడు నెలలు ఆమెతో కూడ ఉండి పిమ్మట తన యింటికి తిరిగివెళ్లెను. 
57  ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను. 
58  అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును ఆమెతోకూడ సంతోషించిరి. 
59  ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా 
60  తల్లి -ఆలాగు వద్దు; వానికి యోహానని పేరు పెట్టవలెనని చెప్పెను. 
61  అందుకు వారు -నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి 
62  వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి. 
63  అతడు వ్రాతపలక తెమ్మని -వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి. 
64  వెంటనే తననోరు తెరువబడి నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. 
65  అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్నవారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదైయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. 
66  ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆసంగతులను గూర్చి వినినవారందరును -ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మసస్సులో ఉంచుకొనిరి. 
67  మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడైయిట్లు ప్రవచించెను - 
 (68-75) 68   ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక 
69  ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను 
70  తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా 
71  మన శత్రువులనుండియు మనలను ద్వేషించువారందరి చేతనుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. 
72  దీనిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తలనోట పలికించెను. 
73  ఆయన మన పితరులను కరుణించుటకును 
74  తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును 
75  మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మనజీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధినిపరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. 
76-79. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు 
  మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు 
  ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. 
  మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయదర్శనమనుగ్రహించెను. 
80  శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను. 
Download Audio File

లూకా2వఅధ్యాయము

1  ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరౌగుస్తువలన ఆజ్ఞ ఆయెను. 
2  ఇది కురేనియు సురియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. 
3  అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. 
4-5. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలైయలోని నజరేతు పట్టణములోనుండి యూదైయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. 
6  వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక 
7  తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 
8  ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా 
9  ప్రభువు దూత వారియొద్దకు వచ్చినిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 
10  అయితే ఆ దూత - భయపడకుడి; ఇదిగో ప్రజలకందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; 
11  దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు
12  దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తోట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి 
13-14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుంచుడెను. 
15  ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు - జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని 
16  త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. 
17  వారు చూచి యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురముచేసిరి. 
18  గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. 
19  అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. 
20  అంతట గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి. 
21  ఆ శిశువుకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసుఅను పేరు వారు ఆయనకు పెట్టిరి. 
22-24. మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధిచేసికొను దినములు గడిచినప్పుడు - ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠచేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టుఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టుగువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యోరూషలేముకు తీసికొనిపోయిరి. 
25  యోరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. 
26  అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడియుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయములోకి వచ్చెను. 
27-28. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోకి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను - 
29-32. - నాధా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగానునీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుటసిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. 
33  యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. 
34  సుమెయోను వారిని దీవించి - ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; 
35  మరియు నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను. 
36  మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడచినదై, 
37  యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాసప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుయుండెను. 
38  ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునికొనియాడి, యోరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనుగూర్చి మాటలాడుచుండెను. 
39  అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున తీర్చిన పిమ్మట గలిలైయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి. 
40  బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలముపొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను. 
41  పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యోరూషలేముకు వెళ్లుచుండువారు. 
42  ఆయన పన్నెండేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకచొప్పున వారు యోరూషలేముకు వెళ్లిరి. 
43  ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యోరూషలేములో నిలిచెను. 
44  ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన పరసలో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి. 
45  ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యోరూషలేమునకు తిరిగి వచ్చిరి. 
46  మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యను కూర్చుండి వారిమాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. 
47  ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. 
48  ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి, ఆయన తల్లి - కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా 
49  ఆయన - మీరేల నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరాఅని వారితో చెప్పెను; 
50  అయితే ఆయన తమతో చెప్పినమాట వారు గ్రహింపలేదు. 
51  అంతట ఆయన వారితోకూడ బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడియుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను. 
52  యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. 
Download Audio File

లూకా3వఅధ్యాయము

1  తిబెరికైసరు ఏలుబడి పదునైదవ సంపత్సరమందు యూదైయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలైయకు హేరోదు చతుర్ధాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్ధాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, 
2  అన్నయు కయపయు ప్రధానయాజకుడు గాను ఉన్నకాలమున అరణ్యములో జెకర్యా కుమారుడైన యోహాను
3-6. అంతట అతడు వచ్చి, పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దానునదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను. - ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరాళముచేయుడి ప్రతిపల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడునువంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగునుసకల శరీరులు దేవుని చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్నయొకని శబ్దముఅని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంధమందు వ్రాయబడినట్టుఇది జరిగెను. 
7  అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి - సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? 
8  మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించుడి - అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొన వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. 
9  ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయబడునని చెప్పెను. 
10  అందుకు జనులు - ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా 
11  అతడు - రెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్యవలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను. 
12  సుంకరులును బాప్తిస్మముపొంద వచ్చి - బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా 
13  అతడు - మీకు నిర్ణయింపబడిన దానికంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను. 
14  రాణువవారును - మేమేమి చేయవలెనని అతని నడిగినందుకు అతడు - ఎవనిని బాధపెట్టకయ ఎవనిమీదను అపనిందవేయకయు మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను. 
15  ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానునుగూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా 
16  యోహాను - నేను నీళ్లతో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోనుఅగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును; 
17  ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలు పోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. 
18  ఇదియుగాక అతడింక అనేక సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటంచెను. 
19  అయితే చతుర్ధాధిపతియైన హేరోదు తన తమ్ముని భార్యయైన హేరోదియ నిమిత్తమును, తాను చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును యోహాను తన్ను గద్దించినందుకు 
20  అదివరకు తాను చేసినవన్నియు చాలనట్టు యోహానును చెరసాలలో వేయించెను. 
21  ప్రజలందరును బాప్తిస్మము పొందునప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్ధన చేయుచుండగా ఆకాశము తెరువబడి 
22  పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురమువలె ఆయనమీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. 
23  యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడై యుండెను. ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను 
24  హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, 
25  మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, 
26  నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు, 
27  యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, 
28  నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదముకు, ఎల్మదాము ఏరుకు, 
29  ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, 
30  లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, 
31  ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు, 
32  దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు, 
33  నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, 
34  యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు, 
35  నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, 
36  షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, 
37  లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, 
38  కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడై యుండెను. 
Download Audio File

లూకా4వఅధ్యాయము

1  యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యొర్దానునదినుండి తిరిగివచ్చి, ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి 
2  నలువది దినములు అపవాదిచేతశోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా 
3  అపవాది - నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. 
4  అందుకు యేసు-మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడుఅని వ్రాయబడియున్నదనివానికి ప్రత్యుత్తరమిచ్చెను. 
5  అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నియు ఒక నిమిషములో ఆయనకు చూపించి 
6-7. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యకోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. 
8  అందుకు యేసు- నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనివానికి ప్రత్యుత్తరమిచ్చెను. 
9  పిమ్మట ఆయనను యెరూషలేముకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడినుండి క్రిందికిదుముకుము 
10  నిన్ను కాపాడుటకు నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 
11  నీ పాదమెప్పుడైన రాతికి తగలకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురుఅని వ్రాయబడియున్నదనిఆయనతో చెప్పెను. 
12  అందుకు యేసు- నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు అని చెప్పబడియున్నదనివానికి ప్రత్యుత్తరమిచ్చెను. 
13  అపవాది ప్రతి శోధన ముగించి, సమయము వచ్చువరకు ఆయనను విడిచిపోయెను. 
14  అప్పుడు యేసు ఆత్మ బలముగలవాడై గలిలైయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. 
15  ఆయన అందరిచేత ఘనతనొంది వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. 
16  తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను తన వాడుకచొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా 
17  ప్రవక్తయైన యెషయాగ్రంధము ఆయన చేతికియ్యబడెను; ఆయన గ్రంధము విప్పగా - 
 18-19. ప్రభువు ఆత్మ నామీద ఉన్నదిబీదలకు సువార్త ప్రకటించుటకైఆయన నన్ను అభిషేకించెనుచెరలోనున్నవారికి విడుదలనుగుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకునునలిగినవారిని విడిపించుటకునుప్రభువు హితవత్సరము ప్రకటించుటకునుఆయన నన్న పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు3 ఆయనకు దొరికెను. 
20-21. ఆయన గ్రంధము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా ఆయన - నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. 
22  ఆప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయననోటనుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుంచుండగా 
23  ఆయన వారిని చూచి - వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామితె చెప్పి, కపెర్నహూములో ఏ కార్యమలు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని నిశ్చయముగా మీరు నాతో చెప్పుదురనెను. 
24  మరియు ఆయన - ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  
25-26. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరునెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్పకరవు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్లుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరియొద్దకును పంపబడలేదు. 
27  మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకమంది కుష్ఠరోగులండినను, సురియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధినొందలేదని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 
28  సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలువిని 
29  ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములోనుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొనిపోయిరి 
30  అయితే ఆయన వారి మధ్యనుండి దాటి మార్గమున వెళ్లిపోయెను. 
31  అప్పుడాయన గలిలైయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను. 
32  ఆయన వాక్యము ఆధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. 
33  ఆ సమాజమందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టినవాడొకడుండెను. 
34  వాడు - వద్దు నజరేయుడవైన యేసూ, నీతో మాకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరశుద్ధుడవని బిగ్గరగా కేకలువేసెను. 
35  అందుకు యేసు - ఊరకుండుము, ఇతని వదలిపొమ్మని దాని గద్దింపగా, దయ్యము వానిని మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలిపోయెను. 
36  అందుకందరు విస్మయమొంది - ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అని వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి. 
37  అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. 
38  ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోకి వెళ్లెను. సీమోను అత్త కఠినజ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. 
39  ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. 
40  సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచివారిని స్వస్థపరచెను. 
41  ఇంతేకాకా దయ్యములు - నీవు దేవుని కుమారుడవని కేకలువేసి అనేకులను వదిలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. 
42  ఉదయమైన తరువాత ఆయన బయలుదేరి అరణ్యప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచిపోకుండ ఆపగా 
43  ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమేగదా నేను పంపబడితినని వారితో చెప్పెను. 
44  తరువాత ఆయన యూదైయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను. 
Download Audio File

లూకా5వఅధ్యాయము

1  జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి 
2  ఆ సరస్సుతీరముననున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. 
3  ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి - దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. 
4  ఆయన బోధించుట చాలించిన తరువాత - నీవు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా 
5  సీమోను - ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమిగాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. 
6  వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా 
7  వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. 
8  సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి - ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. 
9  ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతని తోకూడ నున్నవారందరును విస్మయమొందిరి. 
10  ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి. ) అందుకు యేసు - భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. 
11  వారు దోనెలను దరికి చేర్చినంతట సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 
12  ఆయన యొక పట్టణములో నున్నప్పుడు కుష్ఠరోగముతో నిండియున్న యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగలపడి - ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. 
13  అప్పుడాయన చెయ్యిచాపి వాని ముట్టి - నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వాని విడిచెను. 
14  అప్పుడాయన - నీవు ఎవరితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్ధమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. 
15  అయితే ఆయననుగూర్చిన సమాచారము మరి ఎక్కవగా వ్యాపించెను. బహుజనసమూహములు ఆయనమాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను. 
16  ఆయన ప్రార్ధనచేయుటకు అరణ్యములోకి వెళ్లుచుండెను. 
17  ఒకనాడాయన బోధించుచుండగా గలిలైయయూదైయ దేశముల ప్రతి గ్రామమునుండియు యోరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. 
18  అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని వాని లోపలికి తెచ్చి ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని. 
19  జనులు గుంపుకూడియుండినందున లోపలికి వాని తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడ యేసు ఎదుట మధ్యను వాని దించిరి. 
20  ఆయన వారి విశ్వాసము చూచి - మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా 
21  శాస్త్రులును పరిసయ్యులును - దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. 
22  యేసు వారి ఆలోచన లెరిగి - మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? 
23  - నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? - నీవు లేచి నడవుమని చెప్పుట సులభమా? 
24  అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యుకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవాని చూచి - నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. 
25  వెంటనే వాడు వారియెదుట లేచి తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. 
26  అందరును విస్మయమొంది - నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయమతో నిండుకొనిరి. 
27  అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవియను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చిండియుండుటచూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా 
28  అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. 
29  ఆ లేవి తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి. 
30  పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి - సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. 
31  అందుకు యేసు - రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. 
32  మారుమనస్సు పొందటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 
33  వారాయనను చూచి - యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. 
34  అందుకు యేసు - పెండ్లికుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటివారిచేత మీరు ఉపవాసము చేయింపగలరా? 
35  పెండ్లి కుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. 
36  ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా - ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దాని చింపివేయును; అదియుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. 
37  ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. 
38  అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను. 
39  పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్తదాని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను. 
Download Audio File

లూకా6వఅధ్యాయము

1  ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. 
2  అప్పుడు పరిసయ్యులలో కొందరు -విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా 
3  యేసు వారితో ఇట్లనెను - తానును తనతోకూడ ఉన్నవారును అకలిగొనినప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైన మీరు చదవలేదా? 
4  అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతోకూడ ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. 
5  మరియు - మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను. 
6  మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోకి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడిచెయ్యిగలవాడొకడుండెను. 
7  శాస్త్రులను పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; 
8  అయితే ఆయన వారి ఆలోచనలెరిగి, ఊచచెయ్యిగలవానితో - నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. 
9  అప్పుడు యేసు - విశ్రాంతిదినమున మేలు చేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి 
10  వారినందరిని చుట్టు చూచి - నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. 
11  అప్పుడు వారు వెర్రికోపముతో నిండుకొని, యేసుని ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి. 
12  ఆ దినములయందు ఆయన ప్రార్ధనచేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 
13  ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. 
14  వీరెవరనగా - ఎవనికి ఆయన పేతురు అను మారుపేరు పెట్టెనొ ఆ సీమోను, అతని సహోదురుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 
15  మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, 
16  యాకొబు సహోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. 
17  ఆయన వారితో కూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును, ఆయన భోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదైయ దేశమంతటినుండియు, యెరూషలేమునుండియు, తూరుసీదోనను పట్టణముల సముద్రతీరములనుండి వచ్చిన బహుజనసమూహమును, 
18  అపవిత్రాత్మలచేత బాధింపబడినవారును వచ్చి స్వస్ధతనొందిరి. 
19  ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్ధపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. 
20  అంతట ఆయన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను - బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. 
21  ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. 
22  మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. 
23  ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 
24  అయ్యో ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు. 
25  అయ్యో ఇప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలార, మీరు దుఃఖించి యేడ్తురు. 
26  మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు అయ్యో; వారి పితరులు అబద్ద ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 
27  వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా - మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, 
28  మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థన చేయుడి. 
29  నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపుకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తికొనిపోవు వానికి నీ అంగీనికూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము. 
30  నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొనిపోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు. 
31  మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. 
32  మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును?పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. 
33  మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును అలాగే చేతురు గదా. 
34  మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును ఇచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. 
35  మీరైతే ఎట్టివారిని గూర్చియైనను నిరాశచేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారియెడలను దుష్టుల యెడలను ఉపకారియై యున్నాడు. 
36  కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్టు మీరును కనికరముగల వారైయుండుడి. 
37  తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; 
38  క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. 
39  మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. 
40  శిష్యుడు తన బోధకుని కంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. 
41  నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? 
42  నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో - సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు తేటగా చూచెదవు. 
43  ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు 
44  ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. 
45  సజ్జనుడు తన హృదయమను ధననిధిలోనుండి సద్విషయములను బయటకు తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయమందు నిండియుండుదానినిబట్టి యొకని నోరు మాటలాడును. 
46  నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? 
47  నాయొద్దకు వచ్చి నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. 
48  వాడు ఇల్లు కట్టవలెననియుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాదివేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. 
49  అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాదివేయక నేలమీద ఇల్లు కట్టినవాని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను. 
Download Audio File

లూకా7వఅధ్యాయము

1  ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోకి వచ్చెను. 
2  అప్పుడొక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు వ్యాధిగ్రస్తుడై చావ సిద్ధమైయుండెను. 
3  శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయనయొద్దకు పంపెను. 
4  వారు యేసునొద్దకు వచ్చి - నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; 
5  అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. 
6  కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గెరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి - మీరాయనయొద్దకు వెళ్లి - ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. 
7  అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, 
8  నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను రాణువవారున్నారు; నేనొకని పోమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఇది చేయుమంటే చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. 
9  యేసు ఈ మాటలు విని అతనిగూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి - ఇశ్రాయేలీయులలోనైన నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. 
10  పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి. 
11  అటుపిమ్మట ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. 
12  ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు బహుమంది ఆమెతోకూడ ఉండిరి. 
13  ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గెరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. 
14  ఆయన - చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా 
15  ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. 
16  అందరు భయాక్రాంతులై - మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి. 
17  ఆయననుగూర్చిన యీ సమాచారము యూదైయయందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. 
18  యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి. 
19  అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి - రాబోవు వాడవు నీవేనా?మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. 
20  ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి - రాబోవు వాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. 
21  ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. 
22  అప్పుడాయన - మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది; 
23  నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. 
24  యోహాను దూతలు వెళ్లిన తరువాత ఆయన యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను - మీరేమిచూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? 
25  మరేమిచూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనినవానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజ గృహములలో ఉందురు. 
26  అయితే మరేమిచూడ వెళ్లితిరి? ప్రవక్తనా? ఆవును గాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను 
27  - ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచునుఅని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. 
28  స్త్రీలు కన్నవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. 
29  ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని 
30  పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. 
31  కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేని పోలియున్నారు? 
32  సంతవీధులలో కూర్చునియుండి - మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతిరి; ప్రలాపించితిమిగాని మీరేడ్వరైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. 
33  బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టెతినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చెను గనుక - వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు. 
34  మనుష్యకుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు - ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు. 
35  అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పు పొందుననెను. 
36  పరిసయ్యులలో ఒకడు తనతోకూడ భోజనము చేయవలెనని ఆయనను కోరుకొనెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండగా 
37  ఆ ఊరులో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక శిలాభరణిలో అత్తరు తీసికొనివచ్చి 
38  వెనుక తట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 
39  ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి - ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగి యుండును; ఇది పాపాత్మురాలు అని తనలోతానను కొనెను. 
40  అందుకు యేసు - సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు - బోధకుడా చెప్పమనెను 
41  అప్పుడు యేసు - అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారలో ఒకడు ఏనూరు దేనారములను మరియొకడు యాబది దేనారములను అచ్చియుండిరి. 
42  ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. 
43  అందుకు సీమోను - అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన - నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి 
44  ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను -ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ యింటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. 
45  నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటినుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. 
46  నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. 
47  ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి 
48  -నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. 
49  అప్పుడాయనతోకూడ భోజనపంక్తిని కూర్చున్నవారు - పాపమును క్షమించుచున్న యితడెవడని తమలో తాము అనుకొనసాగిరి. 
50  అందుకాయన - నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను. 
Download Audio File