1-4. ఘనతవహించిన థెయొఫిలా, ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకై వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని 5-6. యూదైయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగితిలోనున్ను జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధులచొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. 7 ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహుకాలము గడచిన (వృద్ధులైరి. ) 8 జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించుచుండగా 9 యాజకమర్యాదచొప్పున ప్రభువు ఆలయములోకి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను. 10 ధూపసమయమందు ప్రజల సమూహమంతయు వెలపట ప్రార్థనచేయుచుండగా 11 ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా 12 జెకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయెను. 13 అప్పుడా దూత అతనితో -జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహను అని పేరు పెట్టుదువు. 14-16. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్బమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. 17 మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువుకొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. 18 జెకర్యా -యిదినాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగ 19 దూత -నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. 20 మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడలేక మౌనివై యుందువని అతనితో చెప్పెను. 21 ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, గర్భాలయమునందు అతడు ఆలస్యము చేసినందకు ఆశ్చర్యపడిరి. 22 అతడు వెలిపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున, గర్భాలయములో అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై యుండెను. 23 అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను. 24 ఆ దినములైన పిమ్మట తన భార్య ఎలీసబెతు గర్భవతియై -మనుష్యులలో నాకుండిన అవమానమును పరిహరించుటకు 25 నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగు చేసెననుకొని అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను. 26 ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలైయలోని నజరేతను ఊరిలో 27 దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యకపేరు మరియ. 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. 29-30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి -ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత -మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. 31 ఇదిగో నీవు గర్భముధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. 33 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల నేలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. 34 అందుకు మరియ -నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా 35 దూత -పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశివు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. 36 మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; 37 దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. 38 అందుకు మరియ -ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్దనుండి వెళ్లెను. 39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి 40 జెకర్యా యింటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనముచేసెను. 41 ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులువేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను - 42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును 43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? 44 ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. 45 ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధంచును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. 46 అప్పుడు మరియ యిట్లనెను - నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 47 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను 48 నా ఆత్మనా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారు నన్నుధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము 50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును. 51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులనుచెదరగొట్టెను 52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను 53 ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులనువట్టిచేతలతో పంపివేసెను. 54-55. అబ్రాహాముకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. 56 అంతట మరియ యించుమించు మూడు నెలలు ఆమెతో కూడ ఉండి పిమ్మట తన యింటికి తిరిగివెళ్లెను. 57 ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను. 58 అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును ఆమెతోకూడ సంతోషించిరి. 59 ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా 60 తల్లి -ఆలాగు వద్దు; వానికి యోహానని పేరు పెట్టవలెనని చెప్పెను. 61 అందుకు వారు -నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి 62 వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి. 63 అతడు వ్రాతపలక తెమ్మని -వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి. 64 వెంటనే తననోరు తెరువబడి నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. 65 అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్నవారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదైయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. 66 ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆసంగతులను గూర్చి వినినవారందరును -ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మసస్సులో ఉంచుకొనిరి. 67 మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడైయిట్లు ప్రవచించెను - (68-75) 68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక 69 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను 70 తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా 71 మన శత్రువులనుండియు మనలను ద్వేషించువారందరి చేతనుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. 72 దీనిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తలనోట పలికించెను. 73 ఆయన మన పితరులను కరుణించుటకును 74 తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును 75 మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మనజీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధినిపరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. 76-79. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయదర్శనమనుగ్రహించెను. 80 శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను. Download Audio File
1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరౌగుస్తువలన ఆజ్ఞ ఆయెను. 2 ఇది కురేనియు సురియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. 3 అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. 4-5. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలైయలోని నజరేతు పట్టణములోనుండి యూదైయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. 6 వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక 7 తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 8 ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా 9 ప్రభువు దూత వారియొద్దకు వచ్చినిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10 అయితే ఆ దూత - భయపడకుడి; ఇదిగో ప్రజలకందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; 11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు 12 దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తోట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి 13-14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుంచుడెను. 15 ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు - జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని 16 త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. 17 వారు చూచి యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురముచేసిరి. 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. 19 అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. 20 అంతట గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి. 21 ఆ శిశువుకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసుఅను పేరు వారు ఆయనకు పెట్టిరి. 22-24. మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధిచేసికొను దినములు గడిచినప్పుడు - ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠచేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టుఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టుగువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యోరూషలేముకు తీసికొనిపోయిరి. 25 యోరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. 26 అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడియుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయములోకి వచ్చెను. 27-28. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోకి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను - 29-32. - నాధా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగానునీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుటసిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. 33 యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. 34 సుమెయోను వారిని దీవించి - ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; 35 మరియు నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను. 36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడచినదై, 37 యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాసప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుయుండెను. 38 ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునికొనియాడి, యోరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనుగూర్చి మాటలాడుచుండెను. 39 అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున తీర్చిన పిమ్మట గలిలైయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి. 40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలముపొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను. 41 పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యోరూషలేముకు వెళ్లుచుండువారు. 42 ఆయన పన్నెండేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకచొప్పున వారు యోరూషలేముకు వెళ్లిరి. 43 ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యోరూషలేములో నిలిచెను. 44 ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన పరసలో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి. 45 ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యోరూషలేమునకు తిరిగి వచ్చిరి. 46 మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యను కూర్చుండి వారిమాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. 47 ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. 48 ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి, ఆయన తల్లి - కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా 49 ఆయన - మీరేల నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరాఅని వారితో చెప్పెను; 50 అయితే ఆయన తమతో చెప్పినమాట వారు గ్రహింపలేదు. 51 అంతట ఆయన వారితోకూడ బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడియుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను. 52 యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. Download Audio File
1 యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యొర్దానునదినుండి తిరిగివచ్చి, ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి 2 నలువది దినములు అపవాదిచేతశోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా 3 అపవాది - నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. 4 అందుకు యేసు-మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడుఅని వ్రాయబడియున్నదనివానికి ప్రత్యుత్తరమిచ్చెను. 5 అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నియు ఒక నిమిషములో ఆయనకు చూపించి 6-7. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యకోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. 8 అందుకు యేసు- నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనివానికి ప్రత్యుత్తరమిచ్చెను. 9 పిమ్మట ఆయనను యెరూషలేముకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడినుండి క్రిందికిదుముకుము 10 నిన్ను కాపాడుటకు నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 11 నీ పాదమెప్పుడైన రాతికి తగలకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురుఅని వ్రాయబడియున్నదనిఆయనతో చెప్పెను. 12 అందుకు యేసు- నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు అని చెప్పబడియున్నదనివానికి ప్రత్యుత్తరమిచ్చెను. 13 అపవాది ప్రతి శోధన ముగించి, సమయము వచ్చువరకు ఆయనను విడిచిపోయెను. 14 అప్పుడు యేసు ఆత్మ బలముగలవాడై గలిలైయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. 15 ఆయన అందరిచేత ఘనతనొంది వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. 16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను తన వాడుకచొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా 17 ప్రవక్తయైన యెషయాగ్రంధము ఆయన చేతికియ్యబడెను; ఆయన గ్రంధము విప్పగా - 18-19. ప్రభువు ఆత్మ నామీద ఉన్నదిబీదలకు సువార్త ప్రకటించుటకైఆయన నన్ను అభిషేకించెనుచెరలోనున్నవారికి విడుదలనుగుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకునునలిగినవారిని విడిపించుటకునుప్రభువు హితవత్సరము ప్రకటించుటకునుఆయన నన్న పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు3 ఆయనకు దొరికెను. 20-21. ఆయన గ్రంధము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా ఆయన - నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. 22 ఆప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయననోటనుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుంచుండగా 23 ఆయన వారిని చూచి - వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామితె చెప్పి, కపెర్నహూములో ఏ కార్యమలు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని నిశ్చయముగా మీరు నాతో చెప్పుదురనెను. 24 మరియు ఆయన - ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25-26. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరునెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్పకరవు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్లుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరియొద్దకును పంపబడలేదు. 27 మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకమంది కుష్ఠరోగులండినను, సురియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధినొందలేదని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 28 సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలువిని 29 ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములోనుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొనిపోయిరి 30 అయితే ఆయన వారి మధ్యనుండి దాటి మార్గమున వెళ్లిపోయెను. 31 అప్పుడాయన గలిలైయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను. 32 ఆయన వాక్యము ఆధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. 33 ఆ సమాజమందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టినవాడొకడుండెను. 34 వాడు - వద్దు నజరేయుడవైన యేసూ, నీతో మాకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరశుద్ధుడవని బిగ్గరగా కేకలువేసెను. 35 అందుకు యేసు - ఊరకుండుము, ఇతని వదలిపొమ్మని దాని గద్దింపగా, దయ్యము వానిని మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలిపోయెను. 36 అందుకందరు విస్మయమొంది - ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అని వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి. 37 అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. 38 ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోకి వెళ్లెను. సీమోను అత్త కఠినజ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. 39 ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. 40 సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచివారిని స్వస్థపరచెను. 41 ఇంతేకాకా దయ్యములు - నీవు దేవుని కుమారుడవని కేకలువేసి అనేకులను వదిలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. 42 ఉదయమైన తరువాత ఆయన బయలుదేరి అరణ్యప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచిపోకుండ ఆపగా 43 ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమేగదా నేను పంపబడితినని వారితో చెప్పెను. 44 తరువాత ఆయన యూదైయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను. Download Audio File
1 జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి 2 ఆ సరస్సుతీరముననున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. 3 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి - దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. 4 ఆయన బోధించుట చాలించిన తరువాత - నీవు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా 5 సీమోను - ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమిగాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. 6 వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా 7 వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. 8 సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి - ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. 9 ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతని తోకూడ నున్నవారందరును విస్మయమొందిరి. 10 ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి. ) అందుకు యేసు - భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. 11 వారు దోనెలను దరికి చేర్చినంతట సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 12 ఆయన యొక పట్టణములో నున్నప్పుడు కుష్ఠరోగముతో నిండియున్న యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగలపడి - ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. 13 అప్పుడాయన చెయ్యిచాపి వాని ముట్టి - నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వాని విడిచెను. 14 అప్పుడాయన - నీవు ఎవరితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్ధమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. 15 అయితే ఆయననుగూర్చిన సమాచారము మరి ఎక్కవగా వ్యాపించెను. బహుజనసమూహములు ఆయనమాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను. 16 ఆయన ప్రార్ధనచేయుటకు అరణ్యములోకి వెళ్లుచుండెను. 17 ఒకనాడాయన బోధించుచుండగా గలిలైయయూదైయ దేశముల ప్రతి గ్రామమునుండియు యోరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. 18 అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని వాని లోపలికి తెచ్చి ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని. 19 జనులు గుంపుకూడియుండినందున లోపలికి వాని తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడ యేసు ఎదుట మధ్యను వాని దించిరి. 20 ఆయన వారి విశ్వాసము చూచి - మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా 21 శాస్త్రులును పరిసయ్యులును - దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. 22 యేసు వారి ఆలోచన లెరిగి - మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? 23 - నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? - నీవు లేచి నడవుమని చెప్పుట సులభమా? 24 అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యుకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవాని చూచి - నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. 25 వెంటనే వాడు వారియెదుట లేచి తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. 26 అందరును విస్మయమొంది - నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయమతో నిండుకొనిరి. 27 అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవియను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చిండియుండుటచూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా 28 అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. 29 ఆ లేవి తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి. 30 పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి - సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. 31 అందుకు యేసు - రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. 32 మారుమనస్సు పొందటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 33 వారాయనను చూచి - యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. 34 అందుకు యేసు - పెండ్లికుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటివారిచేత మీరు ఉపవాసము చేయింపగలరా? 35 పెండ్లి కుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. 36 ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా - ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దాని చింపివేయును; అదియుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. 37 ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. 38 అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను. 39 పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్తదాని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను. Download Audio File
1 ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. 2 అప్పుడు పరిసయ్యులలో కొందరు -విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా 3 యేసు వారితో ఇట్లనెను - తానును తనతోకూడ ఉన్నవారును అకలిగొనినప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైన మీరు చదవలేదా? 4 అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతోకూడ ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. 5 మరియు - మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను. 6 మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోకి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడిచెయ్యిగలవాడొకడుండెను. 7 శాస్త్రులను పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; 8 అయితే ఆయన వారి ఆలోచనలెరిగి, ఊచచెయ్యిగలవానితో - నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. 9 అప్పుడు యేసు - విశ్రాంతిదినమున మేలు చేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి 10 వారినందరిని చుట్టు చూచి - నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. 11 అప్పుడు వారు వెర్రికోపముతో నిండుకొని, యేసుని ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి. 12 ఆ దినములయందు ఆయన ప్రార్ధనచేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 13 ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. 14 వీరెవరనగా - ఎవనికి ఆయన పేతురు అను మారుపేరు పెట్టెనొ ఆ సీమోను, అతని సహోదురుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, 16 యాకొబు సహోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. 17 ఆయన వారితో కూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును, ఆయన భోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదైయ దేశమంతటినుండియు, యెరూషలేమునుండియు, తూరుసీదోనను పట్టణముల సముద్రతీరములనుండి వచ్చిన బహుజనసమూహమును, 18 అపవిత్రాత్మలచేత బాధింపబడినవారును వచ్చి స్వస్ధతనొందిరి. 19 ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్ధపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. 20 అంతట ఆయన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను - బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. 21 ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. 22 మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. 23 ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 24 అయ్యో ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు. 25 అయ్యో ఇప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలార, మీరు దుఃఖించి యేడ్తురు. 26 మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు అయ్యో; వారి పితరులు అబద్ద ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 27 వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా - మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, 28 మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థన చేయుడి. 29 నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపుకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తికొనిపోవు వానికి నీ అంగీనికూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము. 30 నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొనిపోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు. 31 మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. 32 మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును?పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. 33 మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును అలాగే చేతురు గదా. 34 మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును ఇచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. 35 మీరైతే ఎట్టివారిని గూర్చియైనను నిరాశచేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారియెడలను దుష్టుల యెడలను ఉపకారియై యున్నాడు. 36 కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్టు మీరును కనికరముగల వారైయుండుడి. 37 తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; 38 క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. 39 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. 40 శిష్యుడు తన బోధకుని కంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. 41 నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? 42 నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో - సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు తేటగా చూచెదవు. 43 ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు 44 ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. 45 సజ్జనుడు తన హృదయమను ధననిధిలోనుండి సద్విషయములను బయటకు తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయమందు నిండియుండుదానినిబట్టి యొకని నోరు మాటలాడును. 46 నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? 47 నాయొద్దకు వచ్చి నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. 48 వాడు ఇల్లు కట్టవలెననియుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాదివేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. 49 అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాదివేయక నేలమీద ఇల్లు కట్టినవాని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను. Download Audio File
1 ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోకి వచ్చెను. 2 అప్పుడొక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు వ్యాధిగ్రస్తుడై చావ సిద్ధమైయుండెను. 3 శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయనయొద్దకు పంపెను. 4 వారు యేసునొద్దకు వచ్చి - నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; 5 అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. 6 కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గెరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి - మీరాయనయొద్దకు వెళ్లి - ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. 7 అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, 8 నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను రాణువవారున్నారు; నేనొకని పోమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఇది చేయుమంటే చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. 9 యేసు ఈ మాటలు విని అతనిగూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి - ఇశ్రాయేలీయులలోనైన నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. 10 పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి. 11 అటుపిమ్మట ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. 12 ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు బహుమంది ఆమెతోకూడ ఉండిరి. 13 ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గెరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. 14 ఆయన - చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా 15 ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. 16 అందరు భయాక్రాంతులై - మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి. 17 ఆయననుగూర్చిన యీ సమాచారము యూదైయయందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. 18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి. 19 అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి - రాబోవు వాడవు నీవేనా?మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. 20 ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి - రాబోవు వాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. 21 ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. 22 అప్పుడాయన - మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది; 23 నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. 24 యోహాను దూతలు వెళ్లిన తరువాత ఆయన యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను - మీరేమిచూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? 25 మరేమిచూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనినవానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజ గృహములలో ఉందురు. 26 అయితే మరేమిచూడ వెళ్లితిరి? ప్రవక్తనా? ఆవును గాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను 27 - ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచునుఅని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. 28 స్త్రీలు కన్నవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. 29 ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని 30 పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. 31 కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేని పోలియున్నారు? 32 సంతవీధులలో కూర్చునియుండి - మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతిరి; ప్రలాపించితిమిగాని మీరేడ్వరైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. 33 బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టెతినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చెను గనుక - వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు. 34 మనుష్యకుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు - ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు. 35 అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పు పొందుననెను. 36 పరిసయ్యులలో ఒకడు తనతోకూడ భోజనము చేయవలెనని ఆయనను కోరుకొనెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండగా 37 ఆ ఊరులో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక శిలాభరణిలో అత్తరు తీసికొనివచ్చి 38 వెనుక తట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 39 ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి - ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగి యుండును; ఇది పాపాత్మురాలు అని తనలోతానను కొనెను. 40 అందుకు యేసు - సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు - బోధకుడా చెప్పమనెను 41 అప్పుడు యేసు - అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారలో ఒకడు ఏనూరు దేనారములను మరియొకడు యాబది దేనారములను అచ్చియుండిరి. 42 ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. 43 అందుకు సీమోను - అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన - నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి 44 ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను -ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ యింటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. 45 నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటినుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. 46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. 47 ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి 48 -నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. 49 అప్పుడాయనతోకూడ భోజనపంక్తిని కూర్చున్నవారు - పాపమును క్షమించుచున్న యితడెవడని తమలో తాము అనుకొనసాగిరి. 50 అందుకాయన - నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను. Download Audio File
1 అటుపిమ్మట ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతిగ్రామములోను సంచారము చేయుచుండగా 2 పన్నెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధలును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహాన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి. 3 వీరును ఇతరులనేకులును తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారముచేయుచు వచ్చిరి. 4 బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను 5 - విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. 6 మరికొన్ని రాతినేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. 7 మరికొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటినణచివేసెను. 8 మరికొన్ని మంచి నేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు - వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని బిగ్గరగా చెప్పెను. 9 ఆయన శిష్యులు - ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా 10 ఆయన - దేవుని రాజ్యమర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయ, వినియు గ్రహింపకయు ఉండనట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి. ) 11 ఈ ఉపమానభావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. 12 త్రోవప్రక్కనుండువారు, వారు వినువారుగాని నమ్మి రక్షణపొందకుండునట్లు అపవాదివచ్చి వారి హృదయములలోనుండి వాక్యమెత్తికొనిపోవును. 13 రాతినేలనుండువారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలిగిపోవుదురు. 14 ముండ్లపొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరపక్వముగా ఫలింపనివారు. 15 మంచి నేలనుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. 16 ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచముక్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి అగుపడవలెనని దీపస్తంభముమీద దాని పెట్టును. 17 తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు. 18 కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. 19 ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేకపోయిరి. 20 అప్పుడు - నీ తల్లియు నీ సహోదరులును నిన్నుచూడగగోరి వెలపట నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. 21 అందుకాయన - దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునై యున్నారని వారితో చెప్పెను. 22 మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సుఅద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి. 23 వారు వెళ్లుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి, దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి 24 గనుక ఆయనయొద్దకు వచ్చి - ప్రభూ ప్రభూ, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. 25 అప్పుడాయన - మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి - ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; యీయన యెవరో అని యొకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. 26 వారు గలిలైయుకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. 27 ఆయన అద్దరి యెక్కినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక గోరీలలోనేగాని యింట ఉండువాడు కాడు. 28 వాడు యేసును చూచి కేకలువేసి ఆయనయెదుట సాగిలపడి - యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసిచెప్పెను. 29 ఏలయనగా ఆయన - ఆ మనుష్యుని విడిచి వెలపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలి సంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోకి తరుముకొని పోయెను. 30-31. యేసు -నీ పేరేమని వాని నడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. 32 అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుగొనగా ఆయన సెలవిచ్చెను. 33 అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోకి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. 34 మేపుచున్నవారు జరిగినదానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆసంగతి తెలియజేసిరి. 35 జనులు జరిగినదానిని చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. 36 అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా 37-38. గెరసీనీయుల దేశప్రాంతములలో నుండు జనులందరు బహుభయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతోకూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. 39 అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెంత గొప్పకార్యములు చెసెనో తెలియజేయుమని వానితో చెప్పి వాని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెంత గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. 40 జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. 41 అంతట సమాజమందిరపు అధికారియైన యయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి 42 యించుమించు పన్నెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి. 43 అప్పుడు పన్నెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీయెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి 44 ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. 45 - నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమనినప్పుడు, పేతురు - యేలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా 46 యేసు - ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. 47 తాను మరుగైయుండలేదని ఆ స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయనయెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను. 48 అందుకాయన -కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. 49 ఆయన ఇంక మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని - అతనితో చెప్పెను. 50 యేసు ఆ మాట విని - భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో ఉత్తరమిచ్చి 51 యింటికి రాగా పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. 52 అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ముకొట్టుకొనుచుండగా ఆయన వారితో - ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. 53 వారామె చనిపోయెనని యెరిగి ఆయనను అపహసించిరి. 54 అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని - చిన్నదానా, లెమ్మని చెప్పగా 55 ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన - ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. 56 - ఆమె తలిదండ్రులు విస్మయము నొందినవారైరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను. Download Audio File
1 ఆయన తన పన్నెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి 2 దేవుని రాజ్యమును ప్రకటించుటకును వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకును వారినంపెను. 3 మరియు ఆయన - మీరు ప్రయాణముకొరకు కర్రనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు. 4 మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడ నుండి బయలుదేరుడి. 5 మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. 6 వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారముచేసిరి. 7 చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు - యోహాను మృతులలోనుండి లేచెననియు, 8 కొందరు - ఏలీయా కనబడెననియు; కొందరు - పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. 9 అప్పుడు హేరోదు - నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. 10 అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. 11 జనసమూహములు అది తెలిసికొని ఆయనను వెబడింపగా ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. 12 ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి - మనమీఅరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని ఆహారము సంపాదించుకొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. 13 ఆయన - మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు - మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. 14-15. వచ్చినవారు రమారమి అయిదువేలమంది పురుషులు. ఆయన - వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి. 16 అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. 17 వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపెళ్లెత్తిరి. 18 ఒకప్పుడాయన ఎవరులేని యొక చోటన ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. - నేనెవడనని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన వారినడుగగా 19 వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు - ఏలీయాయనియు, కొందరు - పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. 20 అందుకాయన - మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు - నీవు దేవుని క్రీస్తువనెను. 21 ఆయన - ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, 22 మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను. 23 మరియు ఆయన అందరితో ఇట్లనెను –ఎవడైన నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. 24 తన ప్రాణనును రక్షించుకొనగొరువాడు దాని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. 25 ఒకడు లోకమంతయు సంపాదించి తన్నుతాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము? 26 నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. 27 ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను నిజముగా మీతో చెప్పుచున్నాననెను. 28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థనచేయుటకు ఒక కొండయెక్కెను. 29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. 30 మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. 31 వారు మహిమతో అగుపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. 32 పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారుమేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. 33 ఆ యిద్దరు పురుషులు ఆయనయొద్దనుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో - ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. 34 అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. 35 మరియు - ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు;ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి వచ్చెను. 36 ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచినవాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి. 37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. 38 అప్పుడు ఆ సమూహములో ఒకడు - బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. 39 ఇదిగో ఒక దయ్యమువాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలువేయును; నురుగు కారునట్లు అది వాని విలవిలలాడించుచు గాయపరచుచు వాని వదలి వదలకుండును. 40 దాని వెళ్లగొట్టవలెనని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొర్రపెట్టుకొనెను. 41 అందుకు యేసు - విశ్వాసములేని మూర్ఖతరమా, నేనెంతకాలము మీతోకూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను. 42 వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాని పడద్రోసి విలవలలాడించెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రికప్పగించెను 43 గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి అశ్చర్యపడిరి. 44 ఆయన చేసినకార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్యపడుచుండగా ఆయన - ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యుకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. 45 అయితే వారామాట గ్రహింపలేదు, అది వారికి మరుగచేయబడెను గనుక వారు దాని తెలిసికొనలేదు; ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి. 46 తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా 47 యేసు వారి హృదయాలోచన ఎరిగి, యొక చిన్నపిల్లను తీసికొని తనయొద్ద నిలువబెట్టి 48 - ఈ చిన్నపిల్లను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. 49 యోహాను - ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని నభ్యంతరపరచితిమని చెప్పెను. 50 అందకు యేసు - మీరు వాని నభ్యంతరపరచకుడి; మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను. 51 ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు 52 ఆయన యెరూషలేముకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధముచేయవలెనని సమరైయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని 53 ఆయన యెరూషలేముకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. 54-55. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి - ప్రభువా, 3మేము ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనముచేయ నాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. 1 56 అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి. 57 వారు మార్గమున వెళ్లుచుండగా ఒకుడు - నీవెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. 58 అందుకు యేసు - నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. 59 ఆయన మరియొకని చూచి - నా వెంటరమ్మని చెప్పగా అతడు - నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమమ్మని మనవిచేయగా 60 ఆయన - మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. 61 మరియొకడు - ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని మా యింట నున్నవారియొద్దసెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా 62 యేసు - నాగటిమీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడుకాడని వానితో చెప్పెను. Download Audio File
1 అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. 2 పంపినప్పుడాయన వారితో ఇట్లనెను - కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. 3 మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. 4 మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; 5 త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు - ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. 6 సమాధానపాత్రుడుఅక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగివచ్చును. 7 వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు. 8 మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందర పెట్టునవి తినుడి. 9 అందులోనున్న రోగులను స్వస్థపరచుడి - దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి. 10 మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయినయెడల 11 మీరు దాని వీధులలోకి పోయి - మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని సహితము మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి. 12 ఆ పట్టణపు గతికంటె సొదొమపట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. 13 అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మద్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన పక్షమున ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. 14 అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును. 15 ఓ కపెర్నహూమా, ఆకాశముమట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. 16 మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవాని నిరాకరించుననెను. 17 ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి - ప్రభువా, దయ్యములు సహితము నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా 18 ఆయన - సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని. 19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు. 20 అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను. 21 ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి - తండ్రీ ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టకి అనుకూలమాయెను. 22 సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింపబడియున్నది; తండ్రియెవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచగోరునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. 23 అప్పడాయన తన శిష్యులవైపు తిరిగి - మీరు చూచుచున్న కార్యములను చూచుకన్నులు ధన్యములైనవి; 24 అనేకమంది ప్రవక్తలును రాజులును మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినుగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను. 25 ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి - బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధంచుచు అడిగెను. 26 అందుకాయన - ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది; నీవేమి చదువుచున్నావని అతని నడుగగా 27 అతడు - నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదనిచెప్పెను. 28 అందుకాయన - నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. 29 అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరచుకొనగోరి అతడు - అవునుగాని నా పొరుగువాడెవడని యేసునడిగెను. 30 అందుకు యేసు ఇట్లనెను - ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు వెళ్లుచు దొంగలచేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. 31 ఆ సమయమందొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుచు ఆతని చూచి ప్రక్కగా పోయెను. 32 ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చిచూచి ప్రక్కగా పోయెను. 33 అయితే ఒక సమరైయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి 34 అతని చూచి, అతనిమీద జాలిపడి దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శంచెను. 35 మరునాడతడు రెండు దేనారములుతీసి ఆ పూటకూళ్లవానికిచ్చి - ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చుచేసినపక్షమున నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. 36 కాగా దొంగలచేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచునని యేసు అడుగగా అతడు - అతనిమీద జాలిపడినవాడే అనెను. 37 అందుకు యేసు - నీవును వెళ్లి ఆలాగు చేయుమని యతనితో చెప్పెను. 38 అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను. 39 ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40 మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి ఆయనయొద్దకు వచ్చి - ప్రభువా, నేను ఒంటిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయముచేయుమని ఆమెతో చెప్పుమనెను. 41 అందుకు ప్రభువు - మార్తా మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది యొక్కటే. 42 మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమెయొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. Download Audio File
1 ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. 2 అందుకాయన - మీరు ప్రార్థన చేయునప్పుడు - తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, 3 మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; 4 మేము మా కచ్చియున్న ప్రతివాని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. 5 మరియు ఆయన వారితో ఇట్లనెను - ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితునియొద్దకు వెళ్లి - స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; 6 నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల 7 అతడు లోపటనేయుండి - నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? 8 అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. 9 అటువలె మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరుకును; తట్టుడి మీకు తీయబడును. 10 అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. 11 మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పాము ఇచ్చునా? గుడ్డు అడిగితే తేలు ఇచ్చునా? 12 కాబట్టి మీరు చెడ్డవారైయుండియు మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగి యుండగా 13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరశుద్ధాత్మను అనుగ్రహించుననెను. 14 ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆదయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. 15 అయితే వారిలో కొందరు - వీడు దయ్యములకు అధిపతియైన బయల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. 16 మరికొందరు ఆయనను శోధించుచు - పరలోకమునుండి యొక సూచక్రియను చూపుమని ఆయన నడిగిరి. 17 ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను - తనకు తానేవ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యముపాడైపోవును; ఇంటికి విరోధమైన యిల్లు కూలిపోవును. 18 సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినపక్షమున వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. 19 నేను బయల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు. 20 అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. 21 బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనునప్పుడు తన సొత్తు భద్రముగా ఉండును. 22 అయితే అతనికంటె బలవంతుడైన యొకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. 23 నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టవాడు. 24 అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేనిచోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున - నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని 25 వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చియుండుటచూచి 26 వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను. 27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్త్రీ ఆయనను చూచి - నిన్నుమోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలువేసి చెప్పగా 28 ఆయన - అవునుగాని దేవుని వాక్యము విని దాని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. 29 మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగెను - ఈ తరమువారు దుష్టతరమువారైయుండి సూచకక్రియ నడుగచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయు వీరికి అనుగ్రహింపబడదు. 30 యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచకముగా ఉండెనో ఆలాగే మనుష్యుకుమారుడును ఈ తరమువారికి సూచకముగా ఉండును. 31 దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితోకూడ లేచి వారిమీద నేరస్థానచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. 32 నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరము వారితోకూడ నిలువబడి వీరిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సుపొందిరి; ఇదిగో యోనాకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. 33 ఎవడును దీపము వెలిగించి చాటుచోటనైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును. 34 నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్నుతేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమైయుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమైయుండును. 35 కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము. 36 ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగమయమైతే దీపము తన కాంతివలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమైయుండునని చెప్పెను. 37 ఆయన బోధించుచుడగా ఒక పరిసయ్యుడు తనతోకూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భజనపంక్తిని కూర్చుండెను. 38 ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. 39 అందుకు ప్రభువిట్లనెను - పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలపట శుద్ధిచేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండియున్నది. 40 అవివేకులారా, వెలుపటి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? 41 కాగా మీకు కలిగినవి ధర్మముచేయుడి, అప్పుడు మీకన్నియు శుద్ధిగా ఉండును. 42 అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాసదాప మొదలైన ప్రతి కూరలోను పదియవ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది. 43 అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరమలలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు. 44 అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను. 45 అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు - బోధకుడా, యీలాగు చెప్పి మమ్ముకూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా 46 ఆయన - అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. 47 అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల గోరీలను మీరు కట్టించుచున్నారు. 48 కావున మీరు సాక్షులై మీ పితరులకార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి గోరీలు కట్టించుదురు. 49 అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా - నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును. 50 వారు కొందరిని చంపుదురు కొందరిని హంసింతురు. 51 కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తమువరకుచిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమువారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. 52 అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను. 53-54. ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరసయ్యులును ఆయనమీద నిండ పగపట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చినది ఏదైనను పట్టుకొనుటకై పొంచి వెదకుచు అనేక సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. Download Audio File
1 అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను –పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి. 2 మరుగైనదేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు. 3 అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును. 4 నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా - దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరనివారికి భయపడకుడి. 5 ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 6 అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. 7 మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి, భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్టులు కారా? 8 మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతలయెదుట వానిని ఒప్పుకొనును. 9 మనుష్యులయెదుట నన్ను ఎరుగననువానిని నేను ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును. 10 మనుష్యుకుమారునిమీద వ్యతిరేకముగా ఒకమాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. 11 వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొనిపోవునప్పుడు మీరు - ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదమా అని చింతింపకుడి; 12 మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆగడియలోనే మీకు నేర్పుననెను. 13 ఆ జనసమూహములో ఒకడు - బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా 14 ఆయన - ఓయీ, మీమీద తీర్పరినిగానైన పంచిపెట్టువానిగానైన నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. 15 మరియు ఆయన వారితో - మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుటవలన అది వాని జీవమునకు మూలముకాదనెను. 16 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. 17 అప్పుడతడు - నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని - నేనీలాగు చేతును; 18 నా కొట్లు విప్పి వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని 19 నా ప్రాణముతో - నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. 20 అయితే దేవుడు - వెర్రివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. 21 దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను. 22 అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను - ఈ హేతువుచేత మీరు - ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. 23 ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? 24 కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. 25 మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువచేసికొనగలడు? 26 కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటినిగూర్చి మీరు చింతింపనేల? 27 పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు; అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదానివలెనైన అలంకరిపబడలేదని మీతో చెప్పుచున్నాను. 28 నేడు పొలములో ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. 29 ఏమి తిందుమో యేమి త్రాగదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. 30 ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును. 31 మీరైతే ఆయన రాజ్యమునువెదకుడి; దీనితో కూడ ఇవి మీకనుగ్రహింపబడును. 32 చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది 33 మీకు కలిగినవాటిని అమ్మి ధర్మముచేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగ రాడు చిమ్మెట కొట్టదు 34 మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. 35 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. 36 తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి. 37 ప్రభువు వచ్చి యే దాసులు మెళుకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజనపంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 38 మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెళుకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 39 దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసిన పక్షమున అతడు మెళకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి. 40 మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. 41 అప్పుడు పేతురు - ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా 42 ప్రభువు ఇట్లనెను - తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యాజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? 43 ఎవని ప్రభువు వచ్చి వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యడు. 44 అతడు తనకు కలిగినది అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. 45 అయితే ఆ దాసుడు - నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే 46 వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్థులతో వానికి పాలునియమించును. 47 తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడకయు అతని చిత్తముచొప్పున జరిగింపకయు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. 48 అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యలు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వానియొద్ద ఎక్కువగా అడుగుదురు గదా. 49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇది వరకే రగులుకొని యుండవలెనని యెంతో కోరుచున్నాను. 50 అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది; అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను. 51 నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? సమాధానమును కాదు భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. 52 ఇప్పటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. 53 తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. 54 మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను - మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు –వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును. 55 దక్షణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; అలాగే జరుగును. 56 వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల? 57 ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల? 58 వాదించువానితోకూడ అధికారియొద్దకు నీవు వెళ్లుచుండగా తని చేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము; లేదా, అతడొకవేళ నిన్ను న్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. 59 నీవు కడపటికాసు చెల్లించువరకు వెలపలికి రానే రావని చెప్పుచున్నాననెను. Download Audio File