Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా15వఅధ్యాయము

1  ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా 
2  పరిసయ్యులును శాస్త్రులును అది చూచి - ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి. 
3  అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. 
4  - మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకువరకు దాని వెదక వెళ్లడా? 
5  అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి 
6  - మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. 
7  అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపివిషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 
8  ఏ స్త్రీకైనను పది వెండి నాణెములు కలిగియుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటే ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? 
9  అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి - నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. 
10  అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను. 
11  మరియు ఆయన ఇట్లనెను - ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. 
12  వారిలో చిన్నవాడు - తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రినడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. 
13  కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడు చేసెను. 
14-15. అదంతయు కర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోకి వాని పంపెను. 
16  వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వానికేమియు ఇయ్యలేదు. 
17  అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు - నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. 
18  నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; 
19  ఇకమీదట నీ కుమారుడ ననిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలివాండ్లలో ఒకనిగా పెట్టుకొనుమని అతినితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. 
20  వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. 
21  అప్పుడు ఆ కూమారుడు అతనితో - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడ ననిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. 
22  అయితే తండ్రి తన దాసులను చూచి - ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి; 
23  క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము; 
24  ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి. 
25  అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని 
26  దాసులలో ఒకని పిలిచి - ఇవి ఏమిటని అడుగగా 
27  ఆ దాసుడు అతనితో - నీ తమ్ముడు వచ్చియున్నాడు; అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వినదూడను వధించెననెను. 
28  అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనోల్లకపోయెను గనుక అతని తండ్రి వెలపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. 
29  అందుకతడు తన తండ్రితో - ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులలో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. 
30  అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితినని చెప్పెను. 
31  అందుకతడు - కుమారుడా, నీవెల్లపుప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి; 
32  మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment