Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా23వఅధ్యాయము

1  అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి 
2  - ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైనరుకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి. 
3  పిలాతు - నీవు యూదుల రాజవా అని ఆయనను అడుగగా ఆయన -నీవన్నట్టే అని అతనితో చెప్పెను. 
4  పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను - ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. 
5  అయితే వారు - ఇతడు గలిలైయదేశము మొదలుకొని ఇంతవరకును యూదైయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. 
6  పిలాతు ఈ మాట విని - ఈ మనుష్యుడు గలిలైయుడా అని అడిగి 
7  ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపువాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. 
8  హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి అనేక సంగతులు విన్నందున ఆయన ఏదైన ఒక సూచకక్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను. 
9  ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. 
10  ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరముమోపిరి. 
11  హేరోదు తన రాణువ వారితో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను. 
12  అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులైయుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి. 
13  అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి 
14  - ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే. అయితే నేను మీయెదుట ఇతని విమర్శింపగా మీరితనిమీద మోపిన నేరములలో ఒక్కటైన నాకు కనబడలేదు; 
15  హేరోదుకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. 
16-17. కాబట్టి నేనితని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా 
18  వారందరు - వీని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి. 
19  వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. 
20  పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను 
21  వారు - వీని సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేసిరి. 
22  మూడవ మారు అతడు - ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగుపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. 
23  అయితే వారొకేపట్టుగా పెద్దకేకలువేసి, వీని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. 
24  కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పు తీర్చి 
25  అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. 
26  వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతని మీద దాని పెట్టిరి. 
27  గొప్ప జనసమూహమును, ఆయనుగూర్చి రొమ్ముకొట్టుకొనుచు దుఖించుచునున్న బహుమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి. 
28  యేసు వారివైపు తిరిగి - యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. 
29  ఇదిగో - గొడ్రాండ్లును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. 
30  అప్పుడు - మా మీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. 
31  వారు పచ్చిమ్రానుకే ఈలాగు చేసినప్పుడు ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను. 
32  మరిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు. 
33  వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి. 
34  యేసు - తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. 
35  ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును - వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. 
36  అంతట రాణువవారును ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి 
37  - నీవు యూదుల రాజవైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. 
38  - ఇతడు యూదులరాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను. 
39  వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు - నీవు క్రీస్తువుగదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను. 
40  అయితే రెండవవాడు వాని గద్దించి - నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 
41  మనకైతే ఇది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పితమును చేయలేదని చెప్పి 
42  ఆయనను చూచి - యేసూ, నీవు నీ రాజ్యముతోవచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. 
43  అందుకాయన వానితో - నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. 
44  అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను; 
45  సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను. 
46  అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. 
47  శతాధిపతి జరిగినది చూచి - ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. 
48  చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. 
49  ఆయనకు నెళవైనవారందరును, గలిలైయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. 
50  అరిమతయియ అను యూదుల పట్టణపు సభికుడైన యోసేపు అను ఒకడుండెను. 
51  అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టుచుండినవాడు. 
52  అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని 
53  దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడు ఉంచబడలేదు. 
54  ఆ దినము సిద్ధపరచుదినము; విశ్రాంతి దినారంభముకావచ్చెను. 
55  అప్పుడు గలిలైయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో దానిని చూచి 
56  తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళతైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి. 
Download Audio File

No comments:

Post a Comment