Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా18వఅధ్యాయము

1  వారు విసుకక నిత్యము ప్రార్థనచేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను 
2  - దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. 
3  ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను, ఆమె అతనియొద్దకు తరచుగా వచ్చి - నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని 
4  అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు - నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను 
5  ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.  
6  మరియు ప్రభువిట్లనెను -అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. 
7  దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్నుగూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? 
8  ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారి విషయమే గదా ఆయన ఆలస్యము చేయుచున్నాడనిమీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యుకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసముండ కనుగొనునా? 
9  తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను 
10  -ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి. 
11  పరిసయ్యడు నిలువబడి - దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను నుండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
12  వారమునకు రెండుమారులుపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను. 
13  అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు - దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 
14  అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడుననియు తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. 
15  తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అదిచూచి (తీసికొనివచ్చిన) వారిని గద్దించిరి. 
16  అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి - చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది. 
17  చిన్నపిల్లవలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు దానిలో నెంతమాత్రమును ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
18  ఒక అధికారి ఆయనను చూచి - సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను. 
19  అందుకు యేసు - నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు 
20  వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. 
21  అందుకతడు - బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను. 
22  యేసు విని -నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. 
23  అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా 
24  యేసు అతని చూచి -ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. 
25  ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను. 
26  ఇది వినినవారు - ఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా 
27  ఆయన - మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను 
28  పేతురు - ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా 
29-30. ఆయన - దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 
31  తరువాత ఆయన తన పన్నెండుమంది శిష్యులను పిలిచి - ఇదిగో యెరూషలేముకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారునిగూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. 
32  ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారాయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మివేసి, 
33  ఆయనను కొరడాలతో కొట్టిచంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. 
34  వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగుచేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. 
35  తరువాత ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. 
36  జనసముహము దాటి పోవుచున్నట్టువాడు చప్పుడు విని - ఇది ఏమని అడుగగా 
37  వారు - నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి. 
38  అప్పుడు వాడు - యేసూ, దావీదు కుమారుడా, నన్ను కురుణించుమని కేకలువేయగా 
39  - ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వాని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా - దావీదు కుమారుడా, నన్ను కురుణించుమని కేకలుపేసెను. 
40  అంతట యేసు నిలిచి, వానిని తన యొద్దకు తీసికొని రమ్మనెను. 
41  వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన - నేను నీకేమి చేయ గోరుచున్నానని అడుగగా వాడు - ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను. 
42  యేసు - చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను; 
43  వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రముచేసిరి. 
Download Audio File

No comments:

Post a Comment