Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా6వఅధ్యాయము

1  ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. 
2  అప్పుడు పరిసయ్యులలో కొందరు -విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా 
3  యేసు వారితో ఇట్లనెను - తానును తనతోకూడ ఉన్నవారును అకలిగొనినప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైన మీరు చదవలేదా? 
4  అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతోకూడ ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. 
5  మరియు - మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను. 
6  మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోకి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడిచెయ్యిగలవాడొకడుండెను. 
7  శాస్త్రులను పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; 
8  అయితే ఆయన వారి ఆలోచనలెరిగి, ఊచచెయ్యిగలవానితో - నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. 
9  అప్పుడు యేసు - విశ్రాంతిదినమున మేలు చేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి 
10  వారినందరిని చుట్టు చూచి - నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. 
11  అప్పుడు వారు వెర్రికోపముతో నిండుకొని, యేసుని ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి. 
12  ఆ దినములయందు ఆయన ప్రార్ధనచేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 
13  ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. 
14  వీరెవరనగా - ఎవనికి ఆయన పేతురు అను మారుపేరు పెట్టెనొ ఆ సీమోను, అతని సహోదురుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 
15  మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, 
16  యాకొబు సహోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. 
17  ఆయన వారితో కూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును, ఆయన భోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదైయ దేశమంతటినుండియు, యెరూషలేమునుండియు, తూరుసీదోనను పట్టణముల సముద్రతీరములనుండి వచ్చిన బహుజనసమూహమును, 
18  అపవిత్రాత్మలచేత బాధింపబడినవారును వచ్చి స్వస్ధతనొందిరి. 
19  ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్ధపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. 
20  అంతట ఆయన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను - బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. 
21  ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. 
22  మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. 
23  ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 
24  అయ్యో ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు. 
25  అయ్యో ఇప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలార, మీరు దుఃఖించి యేడ్తురు. 
26  మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు అయ్యో; వారి పితరులు అబద్ద ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 
27  వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా - మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, 
28  మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థన చేయుడి. 
29  నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపుకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తికొనిపోవు వానికి నీ అంగీనికూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము. 
30  నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొనిపోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు. 
31  మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. 
32  మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును?పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. 
33  మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును అలాగే చేతురు గదా. 
34  మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును ఇచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. 
35  మీరైతే ఎట్టివారిని గూర్చియైనను నిరాశచేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారియెడలను దుష్టుల యెడలను ఉపకారియై యున్నాడు. 
36  కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్టు మీరును కనికరముగల వారైయుండుడి. 
37  తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; 
38  క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. 
39  మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. 
40  శిష్యుడు తన బోధకుని కంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. 
41  నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? 
42  నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో - సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు తేటగా చూచెదవు. 
43  ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు 
44  ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. 
45  సజ్జనుడు తన హృదయమను ధననిధిలోనుండి సద్విషయములను బయటకు తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయమందు నిండియుండుదానినిబట్టి యొకని నోరు మాటలాడును. 
46  నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? 
47  నాయొద్దకు వచ్చి నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. 
48  వాడు ఇల్లు కట్టవలెననియుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాదివేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. 
49  అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాదివేయక నేలమీద ఇల్లు కట్టినవాని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment