Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా7వఅధ్యాయము

1  ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోకి వచ్చెను. 
2  అప్పుడొక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు వ్యాధిగ్రస్తుడై చావ సిద్ధమైయుండెను. 
3  శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయనయొద్దకు పంపెను. 
4  వారు యేసునొద్దకు వచ్చి - నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; 
5  అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. 
6  కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గెరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి - మీరాయనయొద్దకు వెళ్లి - ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. 
7  అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, 
8  నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను రాణువవారున్నారు; నేనొకని పోమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఇది చేయుమంటే చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. 
9  యేసు ఈ మాటలు విని అతనిగూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి - ఇశ్రాయేలీయులలోనైన నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. 
10  పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి. 
11  అటుపిమ్మట ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. 
12  ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు బహుమంది ఆమెతోకూడ ఉండిరి. 
13  ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గెరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. 
14  ఆయన - చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా 
15  ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. 
16  అందరు భయాక్రాంతులై - మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి. 
17  ఆయననుగూర్చిన యీ సమాచారము యూదైయయందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. 
18  యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి. 
19  అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి - రాబోవు వాడవు నీవేనా?మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. 
20  ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి - రాబోవు వాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. 
21  ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. 
22  అప్పుడాయన - మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది; 
23  నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. 
24  యోహాను దూతలు వెళ్లిన తరువాత ఆయన యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను - మీరేమిచూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? 
25  మరేమిచూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనినవానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజ గృహములలో ఉందురు. 
26  అయితే మరేమిచూడ వెళ్లితిరి? ప్రవక్తనా? ఆవును గాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను 
27  - ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచునుఅని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. 
28  స్త్రీలు కన్నవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. 
29  ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని 
30  పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. 
31  కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేని పోలియున్నారు? 
32  సంతవీధులలో కూర్చునియుండి - మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతిరి; ప్రలాపించితిమిగాని మీరేడ్వరైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. 
33  బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టెతినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చెను గనుక - వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు. 
34  మనుష్యకుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు - ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు. 
35  అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పు పొందుననెను. 
36  పరిసయ్యులలో ఒకడు తనతోకూడ భోజనము చేయవలెనని ఆయనను కోరుకొనెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండగా 
37  ఆ ఊరులో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక శిలాభరణిలో అత్తరు తీసికొనివచ్చి 
38  వెనుక తట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 
39  ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి - ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగి యుండును; ఇది పాపాత్మురాలు అని తనలోతానను కొనెను. 
40  అందుకు యేసు - సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు - బోధకుడా చెప్పమనెను 
41  అప్పుడు యేసు - అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారలో ఒకడు ఏనూరు దేనారములను మరియొకడు యాబది దేనారములను అచ్చియుండిరి. 
42  ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. 
43  అందుకు సీమోను - అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన - నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి 
44  ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను -ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ యింటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. 
45  నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటినుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. 
46  నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. 
47  ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి 
48  -నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. 
49  అప్పుడాయనతోకూడ భోజనపంక్తిని కూర్చున్నవారు - పాపమును క్షమించుచున్న యితడెవడని తమలో తాము అనుకొనసాగిరి. 
50  అందుకాయన - నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment